మమతా బెనర్జీ - ఒవైసీల మధ్య మాటల యుద్ధం

  • హైదరాబాదు పార్టీని బీజేపీ తెస్తోందన్న మమత
  • నన్ను కొనే మనిషి ఇంత వరకు పుట్టలేదన్న ఒవైసీ
  • పార్టీ నేతలు బీజేపీలో చేరుతుండటంతో మమత ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ, ఎంఐఎంల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో ముస్లింలను చీల్చేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి హైదరాబాదు నుంచి బీజేపీ ఒక పార్టీని తీసుకొస్తోందని ఎంఐఎంను ఉద్దేశించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

తనను డబ్బుతో కొనే మనిషి ఇంత వరకు పుట్టలేదని ఒవైసీ అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని... ఆమె చాలా ఆందోళనగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆమె పార్టీకి చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారని... దీంతో, ఆమె భయానికి గురవుతున్నారని చెప్పారు. బీహార్ ఓటర్లను, బీహార్ లో తమకు ఓటు వేసిన వారిని ఆమె అవమానించారని మండిపడ్డారు. ముస్లిం ఓట్లు మీ జాగీరు కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటింది. ఐదు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇదే ఊపులో పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత తమిళనాడులో కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.


More Telugu News