యుద్ధనౌకల కోసం మరిన్ని బ్రహ్మోస్ లను కొనుగోలు చేయనున్న నేవీ!

  • 38 మిసైళ్లను కొనడానికి ప్రతిపాదనలు
  • రక్షణ శాఖ అంగీకరించగానే ప్రక్రియ మొదలు
  • రూ. 1,800 కోట్లతో నేవీ ప్రణాళిక
యుద్ధనౌకల శక్తిని మరింత పెంచేలా 38 ఆధునికీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైళ్లను కొనుగోలు చేయాలని భారత నౌకాదళం నిర్ణయించింది. 450 కిలోమీటర్ల రేంజ్ లోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే వీటిని యుద్ధ నౌకలపై మోహరించాలని ప్రతిపాదించింది. విశాఖపట్నంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న వార్ షిప్ లపై వీటిని ఫిట్ చేయాలని, ఆ తరువాతే వీటిని జాతికి అంకితం చేయాలని కూడా నేవీ భావిస్తోంది.

ఇందుకోసం మొత్తం రూ. 1,800 కోట్లను వెచ్చించాలని, ఇప్పటికే కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ శాఖకు పంపించామని, అనుమతులు రాగానే ప్రక్రియను పూర్తి చేస్తామని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సముద్ర జలాల్లో గస్తీ తిరుగుతున్న పలు రకాల యుద్ధ నౌకలపై బ్రహ్మోస్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలావుండగా, యుద్ధనౌకలపై నిలిపిన బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఐఎన్ఎస్ చెన్నై నుంచి గతంలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టంపై 450 కిలోమీటర్ల కన్నా దూరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఇది సమర్థవంతంగా ఛేదించింది. ఇక ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాలని కూడా డీఆర్డీఓ ప్రణాళికలు రూపొందించింది.

ఇండియా, రష్యాల మధ్య 90వ దశకంలో ప్రారంభమైన జాయింట్ వెంచర్, ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. వీటిని విమానాల నుంచి, నౌకల నుంచి, ఉపరితలం నుంచి అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగించే వీలుంటుంది. దీంతో వీటిని ఇండియా పెద్దఎత్తున సమకూర్చుకుంటూ, సైనిక బలాన్ని పెంచుతోంది.


More Telugu News