ఇన్నేళ్ల పాటు పార్టీ నుంచి లాభపడి.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు: రెబెల్స్ పై మమత బెనర్జీ ఫైర్

  • పార్టీపై విమర్శలు చేసిన వారిని క్షమించను
  • యుద్ధ సమయంలో గెలుపు గురించే ఆలోచించాలి
  • రాష్ట్రం నుంచి బీజేపీని తరిమి కొట్టడమే మన లక్ష్యం
పార్టీ రెబెల్ నేతలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిప్పులు చెరిగారు. పార్టీలో కుటుంబ రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ టీఎంసీ సీనియర్ నేత, మాజీ మంత్రి సువేందు అధికారి విమర్శలు గుప్పించిన నేపథ్యంలో, మమత మండిపడ్డారు. ఈ వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ లో పర్యటించనున్నారు. ఆయన సమక్షంలో సువేందు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్ లో నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ, తాము ప్రజల పక్షాన ఉంటామని, ప్రజల కోసం పోరాడతామని చెప్పారు. పార్టీలో ఎవరు ఎవరి కంటే పెద్ద అనేది సమస్యే కాదని అన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీ నుంచి లబ్ధి పొందిన వారు ఏదేదో మాట్లాడుతున్నారని... అలాంటి వారిని తాను క్షమించలేనని మండిపడ్డారు. అలాంటి నాయకుల భవిష్యత్తును పార్టీ కోసం 365 రోజులు పని చేసే కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్పారు.

పార్టీలోని పాత, కొత్త నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఎవరు పెద్ద అనే విషయం గురించి ఆలోచించవద్దని చెప్పారు. యుద్ధ సమయంలో గెలుపు గురించే ఆలోచించాలని అన్నారు. బెంగాల్ నుంచి బీజేపీని తరిమి కొట్టడమే లక్ష్యంగా అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.


More Telugu News