మోదీ, అమిత్ షాపై 100 మిలియన్ డాలర్ల దావాను కొట్టివేసిన అమెరికా కోర్టు

  • గతేడాది అమెరికాలో హౌడీ మోదీ ఈవెంట్
  • ఈ సందర్భంగా మోదీ, అమిత్ షాలపై దావా
  • కశ్మీర్ అధికారాలు రద్దు చేశారంటూ ఫిర్యాదు
  • పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
  • దావా వేసి కోర్టుకు గైర్హాజరైన వేర్పాటు వాద సంస్థలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై అమెరికా న్యాయస్థానంలో దాఖలైన దావా వీగిపోయింది. పిటిషనర్లు కోర్టులో హాజరు కాకపోవడంతో అమెరికా కోర్టు ఆ దావాను కొట్టివేసింది. రెండు విచారణలకు పిటిషనర్లు రాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ 'హౌడీ మోదీ' పేరిట భారీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు కొన్నిరోజుల ముందు సెప్టెంబరు 19న ఈ దావా వేశారు. కశ్మీర్ ఖలిస్తాన్ వేర్పాటు వాద సంస్థ, మరో రెండు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను తొలగిస్తూ భారత పార్లమెంటు నిర్ణయం తీసుకోవడం, కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం వంటి చర్యలకు మోదీ, అమిత్ షా, లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ థిల్లాన్ లను బాధ్యులుగా చూపుతూ ఈ మూడు సంస్థలు అమెరికా కోర్టులో 100 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాయి.

దీనిపై రెండు పర్యాయాలు విచారణ జరిపినా, పిటిషనర్లు గైర్హాజరవడంతో అక్టోబరు 6న ఈ కేసును డిస్మిస్ చేయాలంటూ యూఎస్ డిస్ట్రిక్ట్స్ కోర్టు న్యాయమూర్తి సిఫారసు చేశారు. అక్టోబరు 22న ఈ కేసును తొలగిస్తూ జడ్జి ఆండ్రూ ఎస్ హానెన్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా, ఈ దావాను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం ఓ ప్రకటన వెలువరించింది.


More Telugu News