కరోనా వ్యాక్సిన్ వేయాలి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేం: హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్

  • జనవరి, ఫిబ్రవరిల్లో వ్యాక్సిన్ రానుందని కేంద్రం చెప్పింది
  • ప్రజలకు రెండు డోసులు వేయాల్సి ఉంటుంది
  • పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది వ్యాక్సిన్ పనుల్లో ఉంటారు
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓ వైపు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం చెపుతుంటే... ఎన్నికలను నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని... వ్యాక్సినేషన్ ప్రక్రియలో పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బంది పాల్గొనాల్సి ఉంటుందని అఫిడవిట్ లో పేర్కొంది.

వ్యాక్సిన్ తొలి డోసు వేసిన నాలుగు వారాల తర్వాత రెండో డోసు వేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని చెప్పింది. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీనిపై ఎన్నికల సంఘం తరపు న్యాయవాది మాట్లాడుతూ, అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని... దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తనకు సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది.


More Telugu News