జపాన్ లో 'ట్విట్టర్ కిల్లర్' కు మరణశిక్ష విధించిన న్యాయస్థానం

  • తొమ్మిది మందిని హత్యచేసిన టకాహిరో షిరాహిషి
  • ట్విట్టర్ ద్వారా అమ్మాయిలతో పరిచయం
  • ఆత్మహత్య ఆలోచనలున్నవారిని తన ఇంటికి ఆహ్వానం
  • ఎనిమిది మంది అమ్మాయిలు, ఒక పురుషుడి హత్య
  • కోర్టులో నేరాంగీకారం
జపాన్ కు చెందిన టకాహిరో షిరాహిషి ఓ సీరియల్ కిల్లర్. అతడికి ట్విట్టర్ కిల్లర్ అని పేరుంది. ఒకర్నీ ఇద్దరినీ కాదు, ఏకంగా తొమ్మిది మందిని షిరాహిషి అంతమొందించాడు.  ఈ కేసును విచారించిన న్యాయస్థానం అతడికి తాజాగా మరణశిక్ష విధించింది.

సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకుని, వారిలో ఆత్మహత్య ఆలోచనలున్న వారిని తన ఇంటికి రప్పించి హత్య చేసేవాడు. ఆత్మహత్య ఎలా చేసుకోవాలన్నదానిపై చర్చిద్దాం రండి అంటూ నమ్మకంగా పిలిచి, వారిని ఖండఖండాలుగా నరికేవాడు. హతులైన వారిలో ఎనిమిది మంది అమ్మాయిలు, ఒక పురుషుడు ఉన్నారు. అమ్మాయిలందరూ 26 ఏళ్ల లోపు వారే.

టకాహిరో షిరాహిషి టోక్యోకు దగ్గర్లోని జామా ప్రాంతంలో నివాసం ఉండేవాడు. 2017లో హాలోవీన్ డే సందర్భంగా పోలీసులు షిరాహిషి ఇంటిపై దాడి చేస్తే దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. కూలర్లు, టూల్ బాక్సుల నిండా మానవ ఖండిత అవయవాలను గుర్తించారు. చేతులు, కాళ్లు, తలలు కనిపించే సరికి పోలీసులు నివ్వెరపోయారు. అప్పట్లో ఈ ఉదంతం జపాన్ లో సంచలనం సృష్టించింది.

కోర్టులో వాదనల సందర్భంగా షిరాహిషి తరపు న్యాయవాది చెబుతూ, చనిపోయిన వారందరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారేనని వివరించాడు. అయితే షిరాహిషి తాను హత్యలు చేసినట్టు అంగీకరించడంతో కోర్టు మరణశిక్ష విధించింది.


More Telugu News