పార్టీ ఏర్పాటు విషయంలో రజనీకాంత్ పై మా ఒత్తిడి లేదు: బీజేపీ నేత పొన్ ‌రాధాకృష్ణన్‌

  • బీజేపీ ప్రమేయం ఏమీ లేదు
  • రజనీ లాంటి నాయకులు రావడం మంచిదే
  • తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు
సినీ నటుడు‌ రజనీకాంత్‌ త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారతాయన్న ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ పార్టీ ప్రారంభిస్తుండడం వెనుక బీజేపీ ఉందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ స్పందిస్తూ..  బీజేపీ ఒత్తిడి కారణంగానే రజనీ రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారన్న విషయాన్ని కొట్టిపారేశారు.

ఆయన పార్టీ పెడుతుండడం వెనుక  బీజేపీ ప్రమేయం లేదని తెలిపారు. రాజకీయాల్లోకి రజనీ కాంత్ లాంటి నాయకులు రావడం మంచిదేనని ఆయన తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని రజనీ భావిస్తున్నారని,  ఆయనకు  తాను శుభాకాంక్షలు కూడా తెలిపానని వ్యాఖ్యానించారు.

ఏ పార్టీల వెనుక తమ పార్టీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే తమిళనాడులో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఆ కూటమిలోనే తమ పార్టీ కొనసాగుతుందని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.


More Telugu News