ఇది ఆరంభం మాత్రమే... గోవాలో బోణీ కొట్టిన సందర్భంగా కేజ్రీవాల్ స్పందన

  • గోవా జిల్లా పంచాయత్ ఎన్నికల్లో ఆప్ బోణీ
  • గోవాకు సంబంధించి తొలి విజయం నమోదు
  • గోవా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామన్న కేజ్రీవాల్
గోవాలో జరిగిన జిల్లా పంచాయత్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని నమోదు చేసింది. ఒక స్థానంలో జయకేతనం ఎగుర వేసింది. తద్వారా గోవాలో తన చరిత్రలో తొలిసారి ఆప్ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

బెనాలిమ్ జిల్లా పరిషత్ స్థానంలో గెలిచిన హాంజెల్ ఫెర్నాండెజ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ చెప్పారు. ఇతర ఆప్ అభ్యర్థుల్లో చాలా మంది గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ ఓట్లను సాధించారని తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని... రాబోయే రోజుల్లో ఆప్ మరింత ప్రభావం చూపుతుందని అన్నారు. గోవా ప్రజల నమ్మకం, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని ఆయన ట్వీట్ చేశారు.

గోవా జిల్లా పంచాయత్ కు సంబంధించి మొత్తం 49 స్థానాలకు ఎన్నికలు జరగగా... 32 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడి, కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకోగా, మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.


More Telugu News