యూఎస్ లో నర్సుకు తొలి వ్యాక్సిన్.. కారణమేమిటంటే..!

  • తొలి టీకా తీసుకున్న సాండ్రా లిండ్సే
  • క్రిటికల్ కేర్ సేవలను సమర్దవంతంగా నిర్వహించినందునే
  • జమైకా నుంచి ఆరేళ్ల వయసులోనే అమెరికాకు
  • సేవా భావం ఆమె కలన్న సోదరుడు గారీఫీల్డ్
అమెరికాలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షిస్తుందని భావిస్తున్న ఫైజర్ టీకా పంపిణీ మొదలు కాగా, తొలుత ఓ నల్లజాతి నర్సు సాండ్రా లిండ్సేకు వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో సేవలందిస్తున్న ఆమె, తొలుత వ్యాక్సిన్ తీసుకున్న మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. ఆమె చిత్రాలు దాదాపు అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. ఇక మొట్టమొదటి వ్యాక్సిన్ ఆమెకే ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారో అధికారులు వెల్లడించారు.

సాండ్రా క్రిటికల్ కేర్ విభాగంలో నర్సుగా సేవలందిస్తున్నారు. క్రిటికల్ కేర్ విభాగమంటే, రోగి పరిస్థితి విషమించినప్పుడు చేసే చికిత్స విభాగం. ఈ చికిత్సలో ప్రతి క్షణమూ అత్యంత కీలకం. కరోనా సోకి, అత్యంత విషమంగా పరిస్థితులు మారిన బాధితులకూ సాండ్రా తన చికిత్సలతో ఉపశమనాన్ని కలిగించారు. ఆమె చికిత్స తరువాత ఎంతో మంది వెంటిలేటర్ స్థాయి నుంచి కూడా కోలుకుని ఇంటికి చేరారు. తన సేవలతో సాండ్రా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అందువల్లే ఆమె పేరును ఉన్నతాధికారులు ఎంపిక చేశారు.

ఇక తన సోదరికి ఇంతటి ఘనత దక్కడంపై లిండ్సే సోదరుడు గారీఫీల్డ్ లిండ్సే స్పందిస్తూ, తను ఆరు సంవత్సరాల వయసులోనే జమైకా నుంచి అమెరికాకు వచ్చిందని, సేవా భావం ఆమె కలని, దాన్ని నిజం చేసుకునేందుకు అనుక్షణం ప్రయత్నించిందని, అందుకు దక్కిన ప్రతిఫలమే ఈ గుర్తింపని అన్నారు. అమెరికాలో తాము తృతీయ దేశస్థులుగా పెరిగామని, కానీ, ప్రజల ఆరోగ్యంపై ఆమెకు ఎంతో శ్రద్ధ ఉండేదని చెప్పుకొచ్చారు.


More Telugu News