రజనీకాంత్ పార్టీ పేరు ‘మక్కల్ సేవై కర్చీ’.. గుర్తు ఆటో?

  • పార్టీ వ్యవహారాల్లో రజనీ బిజీబిజీ
  • ఈ నెలాఖరున పార్టీ పేరు, గుర్తును ప్రకటించే అవకాశం
  • బాబా గుర్తును కేటాయించేందుకు ఈసీ నిరాకరణ
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలపై దృష్టిసారించిన రజనీకాంత్.. తాజాగా పార్టీ పేరు, గుర్తులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీటిపై కసరత్తు చేస్తూ వచ్చిన రజనీకాంత్ వీటి విషయంలో ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

పార్టీ పేరును ‘మక్కల్ సేవై కర్చీ’ (ప్రజాసేవ పార్టీ)గా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. అలాగే, పార్టీ గుర్తుగా ఆటోను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ నెలాఖరున ఈ రెండింటిపై ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది.

నిజానికి రజనీకాంత్ తన పార్టీ గుర్తుగా ‘బాబా లోగో’ను కోరారని, అయితే, ఎన్నికల సంఘం దానిని తిరస్కరించిందని సమాచారం. దీంతో ఆటో గుర్తును కోరగా దానిని కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 31న రజనీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారని అభిమానులు, పార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా అర్జునమూర్తిని, సూపర్ వైజర్‌గా తమిళరువి మణియన్‌లను నియమించుకున్నారు.


More Telugu News