ఇప్పుడే కాదు.. ఇంకా సమయం పడుతుంది: టీపీసీసీ చీఫ్ నియామకంపై మాణికం ఠాగూర్

  • ఇంకా అభిప్రాయ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది
  • టీఆర్ఎస్ తీరు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలా ఉంది
  • ప్రజాదరణ లేని నేతలే పార్టీని వీడుతున్నారు
ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడి నియామకానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. అభిప్రాయాల సేకరణ ఇంకా పూర్తి కాలేదని, అధ్యక్షుడి నియామకానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ తెలిపారు.

ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు 162 మంది అభిప్రాయం తీసుకున్నామని, ఈ మొత్తం వ్యవహారం పూర్తయి, అధిష్ఠానానికి నివేదిక సమర్పించేందుకు మరింత సమయం పడుతుందని ఠాగూర్ పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు నివేదిక అందిస్తామని, ఆ తర్వాత అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని మాణికం ఠాగూర్ చెప్పారు.

అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే అధిష్ఠానాన్ని కలవొచ్చని, ఈ విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని అన్నారు. సంస్థాగతమైన లోపాల కారణంగా ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైందన్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజాదరణలేని నాయకులే పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ తీరు ‘గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తాము చెప్పినట్టే ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారని మాణికం ఠాగూర్ ఎద్దేవా చేశారు.


More Telugu News