గ్యాంగ్‌స్టర్ నయీం ఆయుధాల డెన్.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి!

  • నాలుగేళ్ల క్రితం షాద్‌నగర్ శివారులో నయీం ఎన్‌కౌంటర్
  • ఎఫ్‌జీజీ దరఖాస్తుకు ఐజీ నాగిరెడ్డి సమాధానం
  • మారణాయుధాలకు తోడు వేల కేజీల వెండి, రెండు కిలోల బంగారం
నాలుగేళ్ల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) దరఖాస్తు చేసుకోగా, ఉత్తరమండలం ఐజీ నాగిరెడ్డి ఇచ్చిన సమాధానాన్ని విస్తుపోయేలా చేస్తోంది. ఈ వివరాలను ఎఫ్‌జీజీ తాజాగా బయటపెట్టింది. దాని ప్రకారం..


మూడు ఏకే 47 రైఫిళ్లు, 9 పిస్టళ్లు, మూడు రివాల్వర్లు, 7 తపంచాలు, 12 బోర్ గన్, స్టెన్‌గన్ చెరోటి, తూటాలు 616, ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, 21 కార్లు, 26 ద్విచక్ర వాహనాలు, 602  సెల్‌ఫోన్లతోపాటు రూ.2.16 కోట్ల నగదు, 2,482 కిలోల వెండి, సుమారు రెండు కిలోల బంగారం, 752 భూ దస్తావేజులు, 130 డైరీలు, పేలుడు పదార్థాలైన 5 కిలోల అమ్మోనియం నైట్రేట్, రెండు హ్యాండ్ గ్రనేడ్లు, జిలెటిన్ స్టిక్స్ 10, ఫ్యూజ్‌వైర్ 10 మీటర్లు, మేగజైన్స్ ఆరు, ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 30.. స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

వందల సంఖ్యలో భూదస్తావేజులు నయీం వద్ద లభించడంపై ఎఫ్‌జీజీ విస్మయం వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా అవి అక్కడికి ఎలా చేరి ఉంటాయని ప్రశ్నించింది. గ్యాంగ్‌స్టర్ డైరీలు, మొబైళ్ల డేటాను విశ్లేషిస్తే పోలీసు అధికారులతో అతడికి ఉన్న సంబంధాలు బయటకొస్తాయని పేర్కొంది. నయీం కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతోందని, అన్ని ఆయుధాలు నయీంకు ఎలా చేరాయో తెలియాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు.


More Telugu News