తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • బీజేపీతో టీఆర్ఎస్ కు రాజీ కుదిరిందనే వార్తల్లో నిజం లేదు
  • రాష్ట్రంలో జరిగింది భారత్ బంద్ కాదు.. సర్కారీ బంద్
  • ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్న కేంద్ర మంత్రి  
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. బీజేపీతో టీఆర్ఎస్ కు రాజీ కుదిరిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి, బీజేపీ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు.

తెలంగాణలో టీఆర్ఎస్ చేసింది భారత్ బంద్ కాదని, సర్కారీ బంద్ అని కిషన్ రెడ్డి అన్నారు. భారత్ బంద్ లో పాల్గొన్న కేసీఆర్, కవితలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు సహకరించినట్టే... ఇకపై బీజేపీ చేసే నిరసన కార్యక్రమాలకు కూడా పోలీసులు సహకరించాలని చెప్పారు. భారత్ బంద్ లో రాష్ట్ర మంత్రులు పాల్గొనడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయంగా మోదీని ఎదుర్కోలేకే కొత్త వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)కి చట్టబద్ధతను కల్పిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో సీడ్ డెవలప్ మెంట్ కోసం ఐటీసీ కంపెనీని ఏర్పాటు చేశామని చెప్పారు. గత 70 ఏళ్లుగా దెబ్బతిన్న వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు. రైతుల ఉద్యమం కేవలం పంజాబ్ కు మాత్రమే పరిమితమని చెప్పారు. రైతులకు విద్యుత్ కోతలు, ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల రైతులకు యూరియాను అందించబోతున్నామని చెప్పారు.


More Telugu News