ఫైజర్ వ్యాక్సిన్ పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖత.. ఆక్స్ ఫర్డ్ వైపు మొగ్గు!

  • ఇప్పటికే పలు దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగం
  • మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాల్సిన పరిస్థితి
  • రవాణా సదుపాయాలు క్లిష్టమన్న అభిప్రాయం
  • ధర కూడా అధికంగా ఉండటంతో ప్రభుత్వ విముఖత
  • తొలి అనుమతి దక్కించుకోనున్న ఆక్స్ ఫర్ట్ వ్యాక్సిన్
కరోనాను ఎదుర్కొనేలా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతోందని నిరూపితమై, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో వాడకానికి అనుమతి పొందిన ఫైజర్ టీకాకు ఇండియాలో చుక్కెదురు కానుంది. ఈ వ్యాక్సిన్ వాడకానికి అనుమతి ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ ధర అధికంగా ఉండటం (సుమారు రూ. 2,728), ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 నుంచి 90 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి వుండటమే ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ వ్యాక్సిన్ అంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ వ్యాక్సిన్ ను స్టోర్ చేయడం, రవాణా చేయడం ఇండియాలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియన్న అభిప్రాయానికి వచ్చిన తరువాత, అన్ని ప్రతికూలాంశాలను పరిగణనలోకి తీసుకుని, దీన్ని కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నట్టు ఫార్మా ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఫైజర్ వ్యాక్సిన్ ను ప్రస్తుతం యూకే, బెహ్రయిన్, కెనడాల్లో వినియోగిస్తుండగా, యూఎస్ ఎఫ్డీయే సైతం అనుమతులు మంజూరు చేయగా, నేటి నుంచి ప్రజలకు టీకా ఇవ్వడం ప్రారంభమైంది. యూఎస్ లో వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ లను తయారు చేసి, స్వయంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. అటువంటి పరిస్థితి ఇండియాలో లేదు. వ్యాక్సిన్ ను స్టోర్ చేసేందుకు ముంబై విమానాశ్రయం కార్గోలో ఏర్పాట్లు చేసినా, దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ.

ఇదే సమయంలో బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ లు సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ ధర 10 డాలర్ల కన్నా లోపుగానే (సుమారు రూ. 737) రానుండటం, దాన్ని పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ పెద్దఎత్తున తయారు చేస్తుండటం, ఈ వ్యాక్సిన్ ను ఇంటింటా ఉండే సాధారణ ఫ్రిజ్ లలోనే నిల్వ చేసే అవకాశాలు ఉండటంతో దీనికే తొలి అనుమతి లభించనుందని కేంద్ర వర్గాలు అంటున్నాయి.


More Telugu News