ప్రణబ్ పుస్తకంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్యే అవుతుంది: కాంగ్రెస్

  • ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’పై స్పందించేందుకు నిరాకరణ
  • పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా వ్యాఖ్యానించలేనన్న మొయిలీ
  • ఆయన ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారోనన్న మాజీ మంత్రి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకంపై స్పందించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా వ్యాఖ్యలు చేయడం తొందరపాటు చర్యే అవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ప్రణబ్ తన ఆత్మకథలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత పార్టీ దృక్కోణం మారిందని ఆయన విమర్శించారు. పార్టీని సమర్థంగా ముందుకు నడిపించడంలో సోనియా విఫలమయ్యారని పేర్కొన్నారు. అలాగే, మన్మోహన్‌సింగ్‌ పార్టీ ఎంపీలను పట్టించుకోవడం మానేశారని రాసుకొచ్చారు. 2004లో తాను కనుక ప్రధాని అయి ఉంటే 2014లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పేదని కొందరు నాయకులు తన వద్ద వ్యాఖ్యానించినట్టు ప్రణబ్ ఆ పుస్తకంలో రాసుకున్నారు.

పుస్తకంలో ప్రణబ్ వెల్లడించిన అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ పుస్తకం వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుస్తకంలో ప్రణబ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మొయిలీ నిరాకరించారు. పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా స్పందించడం తొందరపాటు చర్యే అవుతుందన్నారు. ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. కాగా మరో నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


More Telugu News