తమిళనాడులోని ఓ ఆలయంలో బయల్పడ్డ నిధినిక్షేపాలు... ఆలయ ట్రస్టు, ప్రభుత్వం మధ్య వివాదం

  • కాంచీపురం జిల్లాలో గుప్తనిధులు లభ్యం
  • బంగారు నాణేలు, ఆభరణాలు దొరికిన వైనం
  • పల్లవుల కాలం నాటివని భావిస్తున్న అధికారులు
  • నిధి తమకే చెందాలంటున్న ఆలయ ట్రస్టు
  • పురాతన ఆలయం కాబట్టి ప్రభుత్వానికే చెందాలంటున్న అధికారులు
పురాతన ఆలయాల్లో నిధులు లభ్యం కావడం కొత్తేమీ కాదు. అప్పటికాలంలో రాజులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆలయాల్లో బంగారం, వజ్రాలు దాచేవారు. తాజాగా, తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని ఉత్తర మేరూర్ కుళంబేశ్వరాలయంలో గుప్తనిధులు దొరికాయి. ఆలయంలో నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా బంగారు ఆభరణాలు, నాణేలు బయటపడ్డాయి. ఈ మొత్తం బంగారం 2 కేజీలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు.

అయితే, ఈ నిధి ఎవరికి చెందాలన్న విషయమై కుళంబేశ్వర ఆలయ ట్రస్టుకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. తమ ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో లేదని, నిధులు ఆలయానికే చెందాలని ఆలయ ట్రస్టు చెబుతుండగా, ఇది పురాతన ఆలయం కాబట్టి నిధులు ప్రభుత్వానికే చెందాలని అధికారులు వాదిస్తున్నారు. కాగా, ఈ నిధులు పల్లవుల కాలం నాటివని భావిస్తున్నారు. ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని తవ్వకాలు కొనసాగిస్తున్నారు.


More Telugu News