ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌కు చురకలంటించిన టీమిండియా మాజీ బ్యాట్స్‌‌మన్ జాఫర్

  • భారత్ క్రికెట్ జట్టులో టాప్ ఆర్డర్ గురించి బ్రాడ్‌హాగ్ విమర్శలు
  • మొదట ఆసీస్ టాపర్ ఆర్డర్‌ గురించి ఆలోచించాలన్న జాఫర్
  • ఆస్ట్రేలియాకు ఇప్పటికీ స్పష్టత లేదని ఎద్దేవా
భారత్ క్రికెట్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గురించి  ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ ఇటీవల విమర్శలు గుప్పించాడు. టాప్ ‌ఆర్డర్‌ ఆఫ్‌స్టంప్‌ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలంటూ వ్యాఖ్యలు చేశాడు. మంచి లెంగ్త్‌లో బంతి పడితే ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలని అన్నాడు. ఆఫ్‌స్టంప్‌నకు దూరంగా వెళ్తున్న బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించొద్దని చెప్పుకొచ్చాడు.

ఆయన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ మండిపడ్డాడు. ఇతరులకు సూచనలు ఇచ్చేముందు ఆస్ట్రేలియా జట్టు తమ టాప్‌ ఆర్డర్‌ ఎవరో తెలుసుకోవాలని ఎద్దేవా చేశాడు. త్వరలో ప్రారంభమయ్యే తొలి టెస్టులో టీమిండియాను ఎదుర్కొనేందుకు తమ ఓపెనర్లుగా ఎవరు దిగనున్నారనే విషయంపై ఆస్ట్రేలియాకు ఇప్పటికీ స్పష్టత లేదని చెప్పాడు.

కాగా, ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా తొలి టెస్టులో ఆడట్లేదు. మరో ఆటగాడికి గాయాలయ్యాయి. అంతేగాక,‌ విల్‌ పుకోవిస్కీ కూడా తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా కంకషన్‌కు గురయ్యాడు.  ఈ నెల‌ 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌లో ఎవరు బరిలోకి దిగుతారన్న ఆసక్తి నెలకొంది.


More Telugu News