ఇంతకన్నా వెరైటీ పెళ్లి విందును చూసుండరు, వినుండరు!

  • వెబ్ కాస్టింగ్ ద్వారా వివాహం
  • వివాహ విందును ఇంటికి పంపిన తమిళ ఫ్యామిలీ
  • 18 రకాల వంటకాలతో పాటు అరిటాకులు కూడా
  • వైరల్ అవుతున్న చిత్రాలు
ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే కరోనా భయాల కారణంగా శుభకార్యాలన్నీ గతంలో జరిగినంత హడావుడిగా మాత్రం జరగడం లేదు. పెళ్లిళ్లకు పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను ఆహ్వానించాల్సిన పరిస్థితి. చాలా మంది పెళ్లిళ్లను 'ఆన్ లైన్ వెడ్డింగ్'గా మార్చేశారు. పెళ్లిని వెబ్ కాస్టింగ్ చేసి లైవ్ చూపిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ వర్చ్యువల్ పెళ్లిళ్లకు ఇప్పుడు మరో హంగు వచ్చి చేరగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

ఓ తమిళ ఫ్యామిలీ, తమ ఇంట పెళ్లిని తలపెట్టింది. పెళ్లిని వైభవంగా జరిపి దాన్ని వెబ్ కాస్టింగ్ చేసింది. అంతవరకూ మామూలుగా అందరూ చేస్తున్నదే. అంతకుమించి ఏదో చేయాలన్న వారి ఆలోచన ఇప్పుడు వైరల్ అయింది. అదేంటో తెలుసా? పెళ్లి విందును ఆహ్వానితుల ఇంటికే పంపడం. పెళ్లి ఆహ్వానపత్రికతో పాటు వెబ్ కాస్టింగ్ టైమింగ్, 'కల్యాణ సాపాటు' (వివాహ విందు)ను కూడా పంపించింది. నాలుగు రంగురంగుల టిఫిన్ బాక్సుల్లో మొత్తం 18 రకాల వంటకాలను ఇళ్లకే పంపింది.

తాము ఆహ్వానించాలనుకున్న అతిథులు వచ్చే వీల్లేకపోవడంతోనే ఈ విధంగా వినూత్నంగా ఆ కుటుంబం ఆలోచించింది. విందుతో పాటు అరిటాకులను, ఏ వంటకం ఎక్కడ వడ్డించుకోవాలన్న విషయాన్ని కూడా ఆ కుటుంబం ముందుగానే ఆహూతులకు తెలుపగా, దాన్ని అందుకున్న ఓ ట్విట్టర్ యూజర్, తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు పెట్టడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది.



More Telugu News