బియ్యంలో ప్లాస్టిక్‌ రాళ్లు.. మంచిర్యాలలో ఆందోళన చెందుతున్న పేదలు

  • మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌ మండలం వేంపల్లి గ్రామంలో ఘటన
  • పేదలు రేషన్‌ దుకాణంలో తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ రాళ్లు 
  • రేషన్ దుకాణంలో తీసుకున్న బియ్యం తినకూడదని చాటింపు
  • ఇప్పటికే తీసుకున్న బియ్యం తిరిగి ఇచ్చేయమని సూచన
మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌ మండలం వేంపల్లి గ్రామంలోని పేదలు రేషన్‌ దుకాణంలో తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ రాళ్లు కనపడడం కలకలం రేపుతోంది. బియ్యం తీసుకున్న పేదలు ఇంటికెళ్లిన తర్వాత వాటిని పరిశీలించడంతో వాటిల్లో చిన్న పరిమాణంలో ప్లాస్టిక్‌ రాళ్లు కనిపించాయని చెప్పారు.

అనంతరం ఆ బియ్యాన్ని తీసుకెళ్లి రేషన్‌ డీలర్‌కు చూపించి మండిపడ్డారు. దీంతో గ్రామ సర్పంచ్,‌ పలువురు పెద్దలు రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యాన్ని పరిశీలించి దండోరా వేయించారు. రేషన్ దుకాణంలో తీసుకున్న బియ్యం తినకూడదని, ఇప్పటికే తీసుకున్న బియ్యం తిరిగి ఇచ్చేయమని చాటింపు వేయించారు. దీంతో బియ్యం తీసుకున్న పేదలు ఆందోళన చెందుతున్నారు.

ప్లాస్టిక్‌ బియ్యం వంటి రాళ్లను కొంతమంది సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్‌ తెలిపారు. ఇటీవల నంనూర్‌ పునరావాస కాలనీలో ఇచ్చిన రేషన్‌ బియ్యంలో కూడా ప్లాస్టిక్‌ రాళ్లు వచ్చినట్లు ప్రచారం జరగడం అలజడి రేపింది. ఇప్పటికే బియ్యాన్ని వండుకుని తిన్న వారంతా ఆందోళన చెందుతున్నారు.




More Telugu News