కోట్ల విలువ చేసే పెయింటింగ్ ను చెత్తబుట్టలో వేసిన ఎయిర్ పోర్టు సిబ్బంది

  • జర్మనీ నుంచి ఇజ్రాయెల్ వెళ్లిన వ్యాపారవేత్త
  • డ్యూసెల్డార్ఫ్  విమానాశ్రయంలో పెయింటింగ్ మరిచిన వైనం
  • పనికిరాని వస్తువు అనుకుని చెత్తబుట్టలో వేసిన సిబ్బంది
  • తన బంధువును అప్రమత్తం చేసిన వ్యాపారవేత్త
  • ఎయిర్ పోర్టులో అణువణువు తనిఖీ చేసిన పోలీసులు
కొన్ని రకాల పెయింటింగ్ లు చూడ్డానికి ఏమీ అర్థం కానట్టుగా కనిపిస్తాయి. కానీ వాటిలో ఇమిడివుండే అసాధారణ సందేశం, చిత్రకారుల బ్రాండ్ ఇమేజ్ కారణంగా అవి కోట్లలో ధర పలుకుతాయి. ఇలాంటిదే ఓ పెయింటింగ్ ను గమనించిన జర్మనీలోని ఓ విమానాశ్రయ సిబ్బంది అదేదో పనికిరాని వస్తువు అనుకుని చెత్తబుట్టలో వేశారు. కానీ దాని విలువ కోట్లల్లో ఉంటుందని అప్పటికి వారికి తెలియదు.

ఓ బిజినెస్ మేన్ జర్మనీ నుంచి ఇజ్రాయెల్ ప్రయాణించే క్రమంలో తన వద్ద ఉన్న రూ.2.5 కోట్ల విలువైన పెయింటింగ్ ను డ్యూసెల్డార్ఫ్ విమానాశ్రయంలో మర్చిపోయాడు. చెకింగ్ కౌంటర్ వద్ద ఆ పెయింటింగ్ ను వదిలేసి, వెళ్లి విమానంలో కూర్చున్నాడు. అయితే విమానం గాల్లోకి లేచిన తర్వాత ఆ వ్యాపారవేత్తకు తన పెయింటింగ్ గుర్తొచ్చింది. ఇజ్రాయెల్ చేరిన వెంటనే ఆ విషయాన్ని జర్మనీ పోలీసులకు మెయిల్ ద్వారా తెలిపాడు. ఆలస్యం అయితే కష్టమని భావించి ఆ విషయాన్ని బెల్జియంలో ఉన్న తన బంధువుకు తెలిపాడు.

వెంటనే ఆ బంధువు జర్మనీ వెళ్లి డ్యూసెల్డార్ఫ్ విమానాశ్రయం సమీప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విమానాశ్రయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, ఆ పెయింటింగ్ ఓ చెత్తబుట్టలో దర్శనమిచ్చింది. గత బుధవారం ఆ పెయింటింగ్ ఎట్టకేలకు సొంతదారు వద్దకు చేరింది. ఆ పెయింటింగ్ ను ఓ ప్రముఖ ఫ్రెంచ్ చిత్రకారుడు గీశాడట.


More Telugu News