చీరాలలో రహదారులను దిగ్బంధించిన వాడరేవు మత్స్యకారులు

  • వాడరేవు, వేటపాలెం, కఠారిపాలెం జాలర్ల మధ్య వివాదం
  • వాడరేవు జాలర్లు బల్ల వల వినియోగిస్తున్నారని ఆరోపణలు
  • ఇరు వర్గాల మధ్య ఘర్షణలు
  • వాడరేవులో విధ్వంసం సృష్టించిన వేటపాలెం, కఠారిపాలెం జాలర్లు
  • నేడు చీరాలలో వాడరేవు జాలర్ల ఆందోళనలు
  • మత్స్యకారులతో చర్చించిన ఎమ్మెల్యే కరణం బలరాం
ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు జాలర్లకు... వేటపాలెం, కఠారిపాలెం మత్స్యకారులకు మధ్య బల్ల వలల వినియోగంపై వివాదం నెలకొంది. చేపల వేటకు చీరాల వాడరేవు జాలర్లు బల్ల వలలు వినియోగిస్తున్నారని, పైగా తమ గ్రామాల పరిధిలో వేటాడుతున్నారని ఇతర గ్రామాల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వేటపాలెం, కఠారిపాలెం జాలర్లు... చీరాల వాడరేవుకు చెందిన మత్స్యకారుల మధ్య కొన్నిరోజులుగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది.

నిన్న కఠారివారిపాలెం జాలర్లు చీరాల వాడరేవులో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో నేడు వాడరేవు జాలర్లు చీరాల రహదారులను దిగ్బంధనం చేశారు. చీరాలలో ఈ ఉదయం నుంచి మత్స్యకారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని వాడరేవు మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈపూరుపాలెం ఎస్సై, చీరాల రూరల్ సీఐని సస్పెండ్ చేయాలని కోరారు. జాలర్ల ఆందోళనలతో చీరాలలో ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ క్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మత్స్యకారులతో చర్చించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


More Telugu News