ఆ జీవోపై లోకేశ్ కు పెద్దగా అవగాహన లేదనుకుంటా: మంత్రి కన్నబాబు

  • సీఎం జగన్ రైతు పక్షపాతి అంటూ కన్నబాబు వ్యాఖ్యలు
  • టీడీపీ నేతలు భరించలేకపోతున్నారని విమర్శలు
  • పత్రికల్లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • పంట నష్టం జీవో ఇచ్చింది చంద్రబాబేనని వెల్లడి
  • నాడు లోకేశ్ దృష్టంతా దొడ్డిదారి రాజకీయాలపై ఉందన్న మంత్రి
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకోవడాన్ని టీడీపీ నేతలు భరించలేకపోతున్నారని, రైతులు తమకు శాశ్వతంగా దూరమవుతారన్న భయంతో నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పత్రికల్లో తమ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ వ్యవసాయ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని కన్నబాబు విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. 33 శాతం పంట నష్టపోతేగానీ పరిహారం ఇవ్వరా? అని లోకేశ్ అన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయని, లోకేశ్ కు పూర్తి సమాచారం తెలియక ఇలా వ్యాఖ్యానించి ఉండొచ్చని అన్నారు. 33 శాతం నష్టపోతేనే పరిహారం ఇవ్వాలని జీవో జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని కన్నబాబు వెల్లడించారు.

"ఆ జీవో ఇచ్చినప్పుడు లోకేశ్ కు పెద్దగా అవగాహన లేదనుకుంటా. నాడు లోకేశ్ దృష్టంతా దొడ్డిదారిన రాజకీయాల్లోకి ఎలా రావాలన్న దానిపైనే ఉండేది" అంటూ విమర్శలు చేశారు.


More Telugu News