సీబీఐ కస్టడీ నుంచి 103 కిలోల బంగారం మాయం... సీబీఐకి ఇది అగ్నిపరీక్ష అన్న కోర్టు!

సీబీఐ కస్టడీ నుంచి 103 కిలోల బంగారం మాయం... సీబీఐకి ఇది అగ్నిపరీక్ష అన్న కోర్టు!
  • 2012లో సురాణా కంపెనీ నుంచి 400 కిలోల బంగారం స్వాధీనం
  • ఆ బంగారం తమ స్వాధీనం చేయాలంటూ కోర్టుకు వెళ్లిన బ్యాంకులు
  • బ్యాంకులకు అనుకూలంగా కోర్టు తీర్పు
  • 100 కిలోలకు పైగా తగ్గిన బంగారం
  • స్థానిక పోలీసులతో విచారణకు ఆదేశించిన కోర్టు
దేశంలో ఎలాంటి అవినీతి కుంభకోణం జరిగినా సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అలాంటి సీబీఐ కస్టడీ నుంచి ఏకంగా 103 కిలోల బంగారం మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే... 2012లో ఓ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చెన్నైలోని సురాణా కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 400.47 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం బిస్కెట్లు, ఆభరణాల రూపంలో ఉంది.

అయితే, సురాణా కంపెనీ అప్పటికే పలు బ్యాంకులకు వందల కోట్లలో బకాయిలు పడింది. ఒక్క ఎస్ బీఐకే ఆ సంస్థ రూ.1,160 కోట్లు ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు. దాంతో ఎస్ బీఐ, ఇతర బ్యాంకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఆ బంగారాన్ని తమకు స్వాధీనం చేసేలా ఆదేశాలివ్వాలని కోరాయి. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్దకు చేరగా, ఆ బంగారాన్ని బ్యాంకులకు స్వాధీనం చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.

దాంతో సీబీఐ తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులకు అప్పగించేందుకు తూకం వేసింది. అయితే దిగ్భ్రాంతి కలిగించే రీతిలో ఏకంగా 103 కిలోల మేర తగ్గుదల కనిపించింది. ఒక్కసారిగా అంత బంగారం ఎలా తగ్గిందో అర్థంకాక సీబీఐ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ విషయం మద్రాస్ హైకోర్టుకు చేరింది. తమకే పాపం తెలియదని కోర్టుకు నివేదిస్తే.... ఒక్కసారిగా 100 కిలోలకు పైగా ఎలా తగ్గుతుందని కోర్టు ప్రశ్నించింది. స్వాధీనం చేసుకున్న సమయంలో బంగారు గొలుసులు, బిస్కెట్లు అన్నీ కలిపి తూకం వేశామని, ఇప్పుడు విడివిడిగా తూకం వేశామని, అందుకే తగ్గి ఉండొచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

అయితే ఈ వాదన నమ్మశక్యంగా లేదన్న మద్రాస్ హైకోర్టు ఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో నిజనిర్ధారణ చేయాలంటూ తమిళనాడు పోలీసు విభాగాన్ని ఆదేశించింది. తాము సీబీఐ అధికారులం అయ్యుండి, ఇప్పుడు స్థానిక పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితిని సీబీఐ అధికారులు జీర్ణించుకోలేకపోయారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలని కోర్టుకు విన్నవించుకోగా, కోర్టు వారి విజ్ఞాపనను తోసిపుచ్చింది. మాయమైన బంగారం వ్యవహారాన్ని ఆర్నెల్లలో తేల్చేయాలంటూ స్థానిక పోలీసులకు విచారణ అధికారాలు ఇచ్చింది.

ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు సీబీఐకి ఓ అగ్నిపరీక్ష అని పేర్కొంది. సీబీఐ అధికారులు సీతాదేవి అంత పవిత్రంగా ఉంటే, వారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉంటే ఈ కేసు నుంచి బయటపడతారని వ్యాఖ్యానించింది. ఇక, పోలీసులతో విచారణ వద్దని సీబీఐ అధికారులు కోరడం పట్ల న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ అధికారులు తామే ఉన్నతులమని భావించనక్కర్లేదని, తమకంటే పోలీసులు తక్కువ అని ఎలా చెబుతారని, పోలీసులంతా నమ్మకస్తులేనని పేర్కొంది.


More Telugu News