తండ్రి యోగ్ రాజ్ సింగ్ వ్యాఖ్యలతో విభేదించిన యువరాజ్ సింగ్

  • ఈరోజు యువరాజ్ సింగ్ పుట్టినరోజు
  • పుట్టినరోజు జరుపుకోవడం లేదని యువీ ప్రకటన
  • రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు సఫలం కావాలని ఆకాంక్ష
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పుట్టిన రోజు నేడు. కానీ, ఈ ఏడాది తాను పుట్టినరోజును జరుపుకోవడం లేదని యువీ ప్రకటించాడు. అయితే, రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు వీలైనంత త్వరగా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

ఇదే సమయంలో రైతులకు మద్దతుగా క్రీడాకారులంతా తమకు వచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేయాలంటూ తన తండ్రి  యోగ్ రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై యువీ విభేదించాడు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పాడు. ఈ మేరకు అర్ధరాత్రి  12.01 గంటలకు యువీ ట్వీట్ చేశాడు.

'మన ఆశలు, కోరికలను నెరవేర్చుకోవడానికి పుట్టినరోజులు ఒక అవకాశాన్ని ఇస్తాయి. అయితే ఈ పుట్టినరోజు జరుపుకోవడానికి బదులు... రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలకు వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని కోరుకుంటున్నాను. దేశానికి జీవనాధారం రైతులే అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. శాంతియుత చర్చల ద్వారా మనం సాధించలేనిది ఏదీ లేదనే విషయాన్ని నేను నమ్ముతాను.

నా తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఒక గర్వించదగ్గ భారతీయుడిగా బాధపడుతున్నాను. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి. ఆ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు.

కరోనా మహమ్మారి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గనందున.... ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. వైరస్ అంతమయ్యేంత వరకు బాధ్యతగా వ్యవహరించాలి. జై జవాన్. జై కిసాన్. జైహింద్' అని యువీ ట్వీట్ చేశాడు.


More Telugu News