రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే మా లక్ష్యం... మీ వంతు తోడ్పాటు అందించండి: బ్యాంకర్లతో సీఎం జగన్

  • సీఎం అధ్యక్షతన 213వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
  • హాజరైన మంత్రులు, అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు
  • ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని వెల్లడి
  • కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని సూచన
  • ఎంఎస్ఎంఈలకు అండగా నిలవాలని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన 213వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు మేలు చేసే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలని సూచించారు. పెట్టుబడి వ్యయం తగ్గి, పంటలకు మార్కెటింగ్ వసతులు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో లాభిస్తుందని అన్నారు.

కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఏమంత ఆశాజనకంగా లేవని సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు, ఎంఎస్ఎంఈలకు కూడా అండగా నిలవాల్సి ఉందని తెలిపారు. మహిళలు ఎంపిక చేసుకున్న వ్యాపారాలను కూడా బ్యాంకర్లు ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మంత్రులు బొత్స, కన్నబాబు, గౌతమ్ రెడ్డి, సీఎస్ నీలమ్ సాహ్నీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ నిఖిల, నాబార్డు సీజీఎం సుధీర్ జన్నావర్, బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు తెలియజేశారు.


More Telugu News