గులాబీ బంతితో ఆస్ట్రేలియా-ఏ జట్టును కకావికలం చేసిన భారత బౌలర్లు

  • సిడ్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులకు ఆలౌట్
  • అనంతరం 108 పరుగులకు కుప్పకూలిన ఆస్ట్రేలియా-ఏ
  • షమీ, సైనీకి చెరో మూడు వికెట్లు
  • రాణించిన బుమ్రా, సిరాజ్
అడిలైడ్ లో డిసెంబరు 17 నుంచి గులాబీ బంతితో డే నైట్ టెస్టు జరగనున్న నేపథ్యంలో టీమిండియాకు అదిరిపోయే ప్రాక్టీసు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్ కు ముందు శుభసంకేతాలు అందిస్తూ భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో సిడ్నీ మైదానంలో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా-ఏ జట్టును టీమిండియా పేసర్లు హడలెత్తించారు.

మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ కు కంగారూ బ్యాట్స్ మెన్ వద్ద సమాధానం లేకపోయింది. దాంతో ఆస్ట్రేలియా-ఏ జట్టు 108 పరుగులకు ఆలౌటైంది.  షమీ 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, సైనీ 19 పరుగులకు 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు 2, సిరాజ్ కు ఓ వికెట్ లభించాయి. ఆస్ట్రేలియా-ఏ జట్టులో కెప్టెన్ అలెక్స్ కేరీ సాధించిన 32 పరుగులే అత్యధికం.

కాగా, టీమిండియాకు కీలకమైన 86 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టీమిండియా రేపు తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.


More Telugu News