పరామర్శకు వెళుతున్న నాయకులపై దాడి చేయడం ఫాసిస్టు చర్య: చంద్రబాబు

  • చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులు!
  •  జగన్ ఫాసిస్టు పాలనకు ఈ దాడులే నిదర్శనమన్న చంద్రబాబు
  • జగన్ ను చూసుకుని రెచ్చిపోతున్నారని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో నేరగాళ్ల రాజ్యం వచ్చిందని విమర్శలు
  • జగన్ వచ్చాక పోలీసు వ్యవస్థ దెబ్బతిన్నదని వెల్లడి
చిత్తూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య వైషమ్యాలు మరోసారి భగ్గుమన్నాయి. కురబలకోట మండలం అంగళ్లు వద్ద తమ పార్టీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. బి.కొత్తకోటలో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుంటే దాడి చేశారని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లే నేతలపై దాడి చేయడం ఫాసిస్టు చర్య అని విమర్శించారు. జగన్ ఫాసిస్టు పాలనకు ఈ దాడులే నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా'కు గండికొట్టారని, జగన్ ను చూసుకుని వైసీపీ ఫాసిస్టు మూకలు విజృంభిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. తాము ఎంత పెద్ద నేరానికి పాల్పడినా ఏమీ కాదన్న ధీమాతో రెచ్చిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు లేకుండా నేరగాళ్ల రాజ్యం తీసుకువచ్చారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోలీసు వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్నారు.


More Telugu News