2017లో జరిగిన పొరపాట్ల వల్లే పోలవరానికి ఇబ్బందులు: మంత్రి అనిల్ కుమార్

  • కేంద్రమంత్రి షెకావత్ తో ఏపీ మంత్రులు బుగ్గన, అనిల్ భేటీ
  • పోలవరం ప్రాజెక్టు నిధులపై చర్చ
  • గతంలో జరిగిన పొరపాట్లను మంత్రికి వివరించామన్న అనిల్
  •  ప్రాజెక్టులో తాగునీటి అంశం ఉంచాలని కోరినట్టు వెల్లడి
  • అనేక అంశాలపై కేంద్రమంతి సానుకూలంగా స్పందించారని వివరణ
ఏపీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిశారు. అనంతరం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించామని వెల్లడించారు. 2017లో జరిగిన పొరపాట్ల వల్ల పోలవరానికి ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. 2017లో జరిగిన పొరపాట్ల గురించి కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు.

నాడు జరిగిన పొరపాట్లపై తమకు అవగాహన ఉందని షెకావత్ చెప్పారని అనిల్ వివరించారు. పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్లేలా చూస్తామని కేంద్రమంత్రి చెప్పారని అన్నారు. ప్రాజెక్టులో తాగునీటి భాగాలు తొలగించారని, వాటిని ఉంచాలని కోరామని చెప్పారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు తాగునీటి అవసరాల అంశం కూడా ఉందని తెలిపారు.

ప్రాజెక్టుకు సంబంధించి పరిహారం, పునరావాసం అంశాలపై కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. పోలవరం సందర్శించాలంటూ కేంద్రమంత్రిని ఆహ్వానించామని, 15 రోజుల్లో వస్తామని ఆయన చెప్పారని మంత్రి అనిల్ తెలిపారు. 


More Telugu News