కరోనా టీకా కావాలా?... అయితే, కో'-విన్' యాప్ గురించి తెలుసుకోండి!

  • అతి త్వరలోనే ఇండియాకు వ్యాక్సిన్
  • పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక యాప్
  • టీకా తీసుకున్న వారి వివరాలతో డేటా బేస్
కరోనా మహమ్మారి నియంత్రణ దిశగా, ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తుండగా, మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చి, పంపిణీకి సిద్ధమయ్యాయి. ఇండియాలోనూ ఈ నెలాఖరు లోగా లేదా వచ్చే సంవత్సరం జనవరిలో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. తొలి దశలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, వయో వృద్ధులకు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇక, ఇదే కరోనా టీకా తీసుకోవాలని భావించే ఇతరులు సహా ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవడం తప్పనిసరని, అందుకోసం 'కో-విన్' పేరిట ప్రత్యేక డిజిటల్ ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేశామని కేంద్ర అధికారులు వెల్లడించారు. అతి త్వరలోనే ఇది యాప్ రూపంలో స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకునేందుకు విడుదల చేయనున్నామని అన్నారు. ఇందులో రిజిస్టర్ చేసుకున్న వారందరి డేటాబేస్ ప్రభుత్వం వద్ద ఉంటుందని, వారికి సంబంధించిన కొవిడ్-19 సంబంధిత డేటానూ సేకరించి పెడతామని అధికారులు వెల్లడించారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రాధాన్యతా క్రమంలో ఈ యాప్ ద్వారా నమోదు చేసుకున్నవారికి అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి మెసేజ్ వస్తుందని, అందులో వారు ఎక్కడ టీకాను తీసుకోవాలి? రెండో డోస్ గురించిన సమాచారం కూడా ఉంటుందని తెలియజేశారు.


More Telugu News