విమానాల్లో బాత్రూముల వినియోగం వద్దు.. డైపర్లు ధరించండి: కేబిన్ సిబ్బందికి చైనా సూచన

  • విమాన సిబ్బంది కోసం 38 పేజీల ఉత్తర్వులు
  • బాత్రూములకు బదులు డైపర్లు వాడాలని సూచన
  • 500 కేసులు దాటిన దేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త అంటూ హెచ్చరిక
కరోనా మహమ్మారి భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచం నెమ్మదిగా కరోనా ముందునాటి స్థితికి చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులను చాలా దేశాలు తిరిగి పాక్షికంగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు విమాన సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి చైనా విమానయాన శాఖ 38 పేజీలున్న ఉత్తర్వులను జారీ చేసింది.

కరోనా నుంచి దూరంగా ఉండేందుకు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. ముఖ్యంగా విమాన సిబ్బంది బాత్రూములను వినియోగించవద్దని, అందుకు బదులుగా డైపర్లు వినియోగించాలని సూచించింది. 500కుపైగా కరోనా కేసులు ఉన్న దేశాలకు ప్రయాణించేటప్పుడు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరని తెలిపింది. కళ్లద్దాలు పెట్టుకోవాలని, పీపీఈ కిట్లు ధరించాలని, బూట్లకు కవర్లు తొడగాలని ఆ ఉత్తర్వుల్లో వివరించింది. చార్టెర్డ్ విమానాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ఫలితంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడింది.


More Telugu News