దుర్గామాత దయ వల్ల బయటపడ్డాను: జేపీ నడ్డా

  • బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉన్నందువల్ల ఏమీ కాలేదు
  • కాన్వాయ్ లోని ఒక్క కారును కూడా వదల్లేదు
  • బెంగాల్ లోని గూండారాజ్ ప్రభుత్వం అంతం కాబోతోంది
కోల్ కతాలోని డైమండ్ హార్బర్ లో బీజేపీ శ్రేణుల సమావేశానికి వెళ్తున్న సమయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇటుకలు, రాళ్లతో కాన్వాయ్ పై దాడి చేశారు. వాహనశ్రేణిలో ఉన్న పలు కార్లు డ్యామేజ్ అయ్యాయి. పలువురు బీజేపీ నేతలు గాయపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ దాడికి పాల్పడిందని బీజేపీ మండిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దాడి జరిగిన తర్వాత జేపీ నడ్డా నేరుగా సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.  

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, తాను సమావేశానికి చేరుకున్నానంటే... అది దుర్గామాత ఆశీర్వాదంవల్లేనని అన్నారు. ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయులు దాడిలో గాయపడ్డారని చెప్పారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికే మచ్చ అని మండిపడ్డారు. తమ కాన్వాయ్ లో ఉన్న ఏ ఒక్క కారును కూడా వదల్లేదని చెప్పారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉన్నందువల్ల తనకు ఏమీ కాలేదని అన్నారు. బెంగాల్ లోని గూండారాజ్ ప్రభుత్వం అంతం కాబోతోందని జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా విజయవర్గీయ తన మోచేతికి అయిన గాయాలను చూపించారు. పోలీసుల సమక్షంలోనే తమపై దుండగులు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. దాడి జరుగుతున్న సమయంలో అసలు మనం మన దేశంలోనే ఉన్నామా? అని అనిపించిందని అన్నారు.


More Telugu News