నాకు జరిగిన అవమానం మహిళా లోకానికే అవమానం: ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి

  • కాజ టోల్ ప్లాజా వద్ద దేవళ్ల రేవతి వీరంగం
  • వీడియోలో వెల్లడైన వైనం
  • టోల్ ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని రేవతి వెల్లడి
  • తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వివరణ
  • నిన్న జరిగిన సంఘటనను వక్రీకరించారని ఆరోపణ
గుంటూరు జిల్లా కాజ టోల్ గేట్ వద్ద తన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ వడ్డెర డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఘటనను వక్రీకరించారని ఆరోపించారు. టోల్ ప్లాజా సిబ్బంది అరగంట పాటు తన పట్ల దురుసుగా వ్యవహరించారని, అక్కడ తనకు జరిగిన అవమానం మహిళా లోకానికే అవమానం అని తెలిపారు.

తన తల్లి మెట్లపై నుంచి జారిపడి గాయాలపాలయ్యారని, ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా, వాహనాలు నిలిచిపోవడంతో బారికేడ్లు తొలగించి వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే, తనపై టోల్ ప్లాజా సిబ్బంది దుర్భాషలాడుతూ దాడికి దిగారని వెల్లడించారు.

కాగా, దేవళ్ల రేవతికి సంబంధించిన వీడియో అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ప్రముఖంగా కనిపిస్తోంది. తన వాహనానికి అడ్డుపెట్టిన బ్యారికేడ్లను రేవతి తొలగిస్తున్న దృశ్యాలు, టోల్ ప్లాజా ఉద్యోగిపై ఆమె చేయిచేసుకున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ క్రమంలో, రేవతిపై పోలీసు కేసు నమోదైంది. సెక్షన్ 188, 294 (బి), 341, 506 కింద కేసు నమోదు చేశారు.


More Telugu News