సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభించిన కేసీఆర్‌

  • ఐటీ టవర్‌కు శంకుస్థాపన
  • మిట్టపల్లిలో రైతు వేదిక ప్రారంభం
  • ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్న కేసీఆర్
సిద్దిపేట జిల్లా దుద్దెడలో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అలాగే, సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో రైతు వేదికను కూడా కేసీఆర్ ప్రారంభించారు.  ఇందులో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సిద్దిపేటలో పర్యటన సందర్భంగా మరికొన్ని  అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందని, తెలంగాణ రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందని తెలిపారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని ఆయన చెప్పారు. భవిష్యత్‌ లో సిద్దిపేట పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని ఆయన అన్నారు.

ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. కాగా, కేసీఆర్‌ సమక్షంలో పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు. దుద్దెడలో ఐటీ పార్కును మూడెకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా  2 వేల మందికి ఉపాధి లభించనుంది.


More Telugu News