రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

  • పంచాయతీ ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
  • మంత్రి ఇలాఖాలోనూ కాంగ్రెస్ ఓటమి
  • ఇది వ్యవసాయ చట్టాలకే ప్రజలు వేసిన ఓటన్న జేపీ నడ్డా
రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ దూసుకుపోగా, కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 4,371 పంచాయతీ సమితులకు 4 దశల్లో ఎన్నికలు నిర్వహించగా నిన్న ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 1,989 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ 1,852 స్థానాలతో సరిపెట్టుకుంది. సీపీఎం 26, ఆర్ఎల్‌పీ 6, బీఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించింది.

అలాగే, జిల్లా పరిషత్ స్థాయిలో 635 స్థానాలకు గాను బీజేపీ 353 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ 252 స్థానాలకే పరిమితమైంది. అలాగే, 21 జిల్లా బోర్డుల్లో బీజేపీ 13, కాంగ్రెస్ ఐదు స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు, మంత్రి గోవింద్ సింగ్ టోటాసరా సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ పరాజయం పాలవడం గమనార్హం. ఈ విజయంపై బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు కోట్లాదిమంది మద్దతు తెలుపుతున్నారని ఈ ఫలితాలు నిరూపించాయన్నారు.


More Telugu News