రైతు నిరసనల గురించి ప్రస్తావిస్తే... అయోమయంలో పాక్ ప్రస్తావన తెచ్చిన బ్రిటన్ ప్రధాని... వీడియో ఇదిగో!

  • రైతు నిరసనలపై స్పందించాలని కోరిన సిక్కు ఎంపీ
  • మధ్యలో పాకిస్థాన్ ను తెచ్చిన బోరిస్ జాన్సన్
  • రెండు దేశాలూ పరిష్కరించుకోవాలనడంతో ఎంపీల అవాక్కు
ఇండియాలో జరుగుతున్న రైతు నిరసనలు, పాకిస్థాన్ తో కశ్మీర్ విషయంలో కొనసాగుతున్న విభేదాలు రెండు వేర్వేరు విషయాలన్న సంగతిని మరచిపోయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, హౌస్ ఆఫ్ కామన్స్ లో అయోమయంలో పడిపోయిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రధానితో ఎంపీల ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ఘటన జరిగింది. బ్రిటన్ కు చెందిన సిక్కు లేబర్ పార్టీ ఎంపీ తన్మన్ జీత్ సింగ్ దేశాయ్, ఇండియాలో జరుగుతున్న రైతుల నిరసనలపై వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, బ్రిటన్ తరఫున స్పందించాలని కోరారు.

"చాలా నియోజకవర్గాలకు చెందిన రైతులు... ముఖ్యంగా పంజాబ్, భారత్ లోని ఇతర ప్రాంతాల రైతులు నిరసనలు తెలుపుతుంటే, వారిపై వాటర్ క్యానన్ లు, టియర్ గ్యాస్ లను ప్రయోగిస్తున్న దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. శాంతియుతంగా తమ అభిప్రాయాలు తెలుపుతున్న వారిపై దారుణంగా ప్రవర్తిస్తుంటే హృదయం ద్రవిస్తోంది. వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది" అని తన్మన్ జీత్ అన్నారు.  

ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి మన అభిప్రాయాలను తెలియజేయాలని, ప్రస్తుత అనిశ్చితిని సాధ్యమైనంత త్వరగా తొలగించి, రైతుల సమస్యలను పరిష్కరించేలా ఒత్తిడి పెంచాలని ఆయన అన్నారు. శాంతియుత నిరసనలకు దిగే హక్కు రైతులకు ఉందని చాటి చెప్పాలన్నారు.

ఆపై తన్మన్ జీత్ ప్రశ్నకు ప్రధాని బోరిస్ జాన్సన్ సమాధానం ఇస్తూ, "ఇండియా - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆ రెండు దేశాల ప్రభుత్వాలూ ఈ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అది జరుగుతుందనే ఆశిస్తున్నాం" అని సమాధానం ఇచ్చారు.

దీంతో పలువురు హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు అవాక్కయ్యారు. కొందరైతే, ఈ వీడియోను ట్విట్టర్ లో పెడుతూ, ప్రధాని తానేం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News