'రాధే శ్యామ్' యాక్షన్ సీన్ కోసం 1000 మంది.. 100 రోజుల శ్రమ!

  • హైదరాబాదులో నెల రోజుల షెడ్యూలు
  • కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ
  • యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ నేతృత్వం  
  • తన స్వప్నం సాకారమైందన్న దర్శకుడు
ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాణంలో వున్న భారీ చిత్రాలలో 'రాధే శ్యామ్' ఒకటి. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తాజాగా హైదరాబాదులో చిత్రీకరించారు. నెల రోజుల పాటు జరిగిన షెడ్యూల్ లో ప్రభాస్, ఫైటర్లు, ఇతర తారాగణంపై దీనిని భారీ ఎత్తున చిత్రీకరించడం జరిగింది.

దీని గురించి దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వివరిస్తూ, 'నా రెండేళ్ల స్వప్నాన్ని నెలరోజుల పాటు సాగిన యాక్షన్ షెడ్యూలులో సాకారం చేయడానికి 1000 మంది 100 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఈ సందర్భంగా.. గతంలో ఎన్నడూ చూడని ఈ అడ్వెంచర్ ని ఆవిష్కరించిన మా యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ కి, అతని టీమ్ కి మా టీమ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.

ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూళ్ల షూటింగును గతంలో జార్జియా, ఇటలీ దేశాలలో నిర్వహించిన సంగతి విదితమే. ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేస్తారు.


More Telugu News