షిరిడీ ఆలయంలోకి రావద్దు... తృప్తీ దేశాయ్ పై నిషేధం విధిస్తూ నోటీసులు!

  • ఆలయంలో సంప్రదాయ దుస్తులకే అనుమతి
  • దుస్తులపై నిబంధనలేంటన్న తృప్తీ దేశాయ్
  • 10వ తేదీన వస్తానని చెప్పడంతో నోటీసులు
షిరిడీలో కొలువైన సాయిబాబా ఆలయం ముందు అంటించిన పోస్టర్లను తానే స్వయంగా తొలగిస్తానని, 10వ తేదీన తన కార్యకర్తలతో కలిసి వస్తున్నానని ప్రకటించిన తృప్తీ దేశాయ్ పై షిరిడీ సబ్ డివిజనల్ ఆఫీస్ నిషేధం విధించింది. 11వ తేదీ వరకూ ఆమెకు ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను మీరి ఆమె ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా, ఇటీవల ఆలయంలోకి వచ్చే భక్తులు సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలని నిర్ణయించిన ఆలయ కమిటీ, ఈ మేరకు పోస్టర్లను ఆలయం గోడలపై ప్రదర్శనకు ఉంచింది. ఈ నిబంధనలను తప్పుబట్టిన తృప్తి, ఇతర సామాజిక కార్యకర్తలతో కలిసి తాను 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామి దర్శనానికి వచ్చి, స్వయంగా తానే పోస్టర్లను తొలగిస్తానని ప్రకటించిన మీదట, శాంతి భద్రతల సమస్యలు తలెత్తవచ్చన్న ఆలోచనతో, ముందు జాగ్రత్తగా ఈ మేరకు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు.


More Telugu News