భారీగా పెరుగుతోన్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు

  • ముడిసరుకుల రేట్లు 15 నుంచి 40 శాతం మధ్య పెరుగుదల
  • టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రో ఓవెన్ల ధరలు పెరుగుదల
  • వచ్చే నెల నుంచి ధరల పెంపు
  • ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు దాదాపు 20 శాతం పెరిగే అవకాశం
ముడిసరుకుల రేట్లు (ఇన్‌పుట్ కాస్ట్స్) 15 నుంచి 40 శాతం మధ్య పెరగడంతో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రో ఓవెన్ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు దాదాపు 20 శాతం పెరగనున్నాయి. ముడిసరుకులైన కాపర్, జింక్‌, అల్యూమినియం, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి వాటి రేట్లు పెరిగాయని, నౌకల ద్వారా  దిగుమతి చేసుకునే  ముడి సరుకుల రవాణా చార్జీల్లో 40 నుంచి 50 శాతం మధ్య పెరుగుదల ఉందని నిపుణులు తెలిపారు.

అలాగే, టీవీ‌ ప్యానెళ్ల ధరలు 30 నుంచి 100 శాతం మధ్య పెరిగినట్లు వివరించారు. గ్లోబల్ మార్కెట్లో వీటి కొరత ఉండడంతో ఈ పరిస్థితి ఉందని చెప్పారు. భారత్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయా సంస్థలకు ముందే తెలిసినప్పటికీ పండుగ సీజన్‌లో ఉండే గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ధరలను పెంచకుండా వాయిదా వేస్తూ వస్తున్నాయని తెలిపారు.

‘ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పండుగ సీజన్ స్టాక్ అంతా ఇప్పుడు అయిపోయింది. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి ఎలక్ట్రానిక్ కంపెనీలు ధరలు పెంచి, విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని ఓ నిపుణుడు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత ఇంత భారీగా ధరలు పెరుగుతున్నాయని వివరించారు.

వాషింగ్ మిషన్లు, ఏసీలు 8 నుంచి 10 శాతం, రిఫ్రిజిరేజర్లు, చెస్ట్ ఫ్రీజర్లు 12 నుంచి 15 శాతం, టెలివిజన్ ధరలు 7 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాపర్, జింక్, అల్యూమినియం ధరలు నాలుగు నెలల నుంచి 40-45 శాతం మధ్య పెరిగాయని తెలిపారు.

రిఫ్రిజిరేటర్లు, చెస్ట్ ఫ్రీజర్ల ముడిసరుకుల ధరలు 200 శాతం, ప్లాస్టిక్ ముడిసరుకుల ధరలు 30 నుంచి 40 శాతం మధ్య పెరిగాయని వివరించారు. దీంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు టీవీల ధరలు  5 నుంచి 7 శాతం మధ్య పెంచాయి.  టీవీ ప్యానెల్ ధరలు 16-20 శాతం మధ్య పెరిగాయి.  

మరోపక్క, ధరలు పెరగడంతో దీని ప్రతికూల ప్రభావం అమ్మకాలపై పడే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్ రంగ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. కరోనాతో కుదేలైన భారత ఆర్థిక రంగం ఆగస్టు నుంచి కాస్త పుంజుకుంది. పండుగ సీజన్‌లో గాడిలోకి వచ్చి మళ్లీ అమ్మకాలు పెరిగాయి. ధరల పెరుగుదలతో మళ్లీ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.


More Telugu News