విషపదార్థం కారణంగా కలిగిన అస్వస్థత అని భావిస్తున్నాం: జీవీఎల్

  • ఏలూరులో పెరుగుతున్న బాధితుల సంఖ్య
  • ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న వ్యాధి కారణం
  • మాస్ హిస్టీరియా కారణం కాదన్న జీవీఎల్
  • ఎయిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడినట్టు వెల్లడి
  • శాంపిల్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు పంపారని వివరణ
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో గత కొన్నిరోజులుగా ప్రజలు మూర్ఛ, వాంతులు, స్పృహకోల్పోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రులపాలవుతున్నారు. 300 మందికి పైగా బాధితులు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏలూరులో ప్రజల అనారోగ్య సమస్యను మాస్ హిస్టీరియా అని భావించడంలేదని స్పష్టం చేశారు. టాక్సిన్ (విషపదార్థం) వల్ల కలిగిన అస్వస్థత అయ్యుంటుందని తెలిపారు. ఏలూరు ఘటనపై కేంద్ర, రాష్ట్ర వైద్య సిబ్బందిని సమన్వయ పరుస్తున్నామని చెప్పారు.

అంతుచిక్కని వ్యాధితో ప్రజలు ఆసుపత్రిపాలవడం పట్ల ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో మాట్లాడానని జీవీఎల్ వెల్లడించారు. ఎయిమ్స్ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎయిమ్స్ మంగళగిరి వైద్యులు ఏలూరు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి రక్తం, మూత్రం, సీఎస్ఎఫ్ నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్ లోని క్లినికల్ ఎకోటాక్సికాలజీ విభాగానికి పంపారని తెలిపారు.


More Telugu News