తొమ్మిది స్టేడియంలను జైళ్లుగా మారుద్దామన్న పోలీసు శాఖ ప్రతిపాదనను తిరస్కరించిన కేజ్రీవాల్

  • ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో రైతులు
  • కేంద్రంతో విఫలమైన ఐదో రౌండ్ చర్చలు
  • రైతులకు మద్దతుగా ఉంటామన్న కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్ష పార్టీలన్నీ మండిపడుతున్నాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, చండీగఢ్, యూపీ నుంచి వచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేపు భారత్ బంద్ కు కూడా పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ బంద్ కు పూర్తి మద్దతు పలికారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై ఇంత వరకు స్పందించలేదు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం-రైతు నేతలకు మధ్య జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా విఫలమయ్యాయి.

ఈ నెల 9న మరోసారి చర్చలు జరగనున్నాయి. ఇదే సమయంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక విన్నపం చేసింది. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలు, వృద్ధులు, పిల్లలను వెనక్కి పంపించాలని తెలిపింది. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణంలో ఉండటం వారి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పింది.

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, రైతుల డిమాండ్లను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. ఈ చట్టాలు తీసుకొచ్చిన ప్రారంభం నుంచి తాను, తమ పార్టీ రైతులకు మద్దతుగా ఉందని తెలిపారు. ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఢిల్లీలోని 9 స్టేడియంలను జైళ్లుగా మారుద్దామనే ప్రతిపాదన పోలీసు శాఖ నుంచి వచ్చిందని... ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని చెప్పారు. రైతులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని అన్నారు. నిరసన కార్యక్రమాల్లో ఉన్న రైతులకు తాము అండగా ఉంటామని... వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. వారికి మద్దతుగా ఉండటం తమ బాధ్యత అని తెలిపారు.


More Telugu News