రైతుల నిరసనల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు... నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!

  • గత కొన్నిరోజులుగా ఢిల్లీలో ఆందోళనలు
  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసన గళం
  • ఐదు దఫాలుగా చర్చలు జరిపినా కుదరని సయోధ్య
  • చట్టాలు రద్దు చేయాలంటున్న రైతులు
  • సవరణలకు సిద్ధమేనంటూ కేంద్రం సంకేతాలు!
జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతుండడం అంతర్జాతీయంగా వార్తాంశంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం రైతు సంఘాల ప్రతినిధులతో ఇప్పటివరకు ఐదు విడతలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవైపు రైతులు ఈ నెల 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో రైతుల నిరసనలపై చర్చించేందుకు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని ఎన్డీయే సర్కారు భావిస్తోంది.

రైతులు కోరుతున్నట్టుగా చట్టాలను రద్దు చేయడం మాత్రం కుదరని పని అని స్పష్టం చేస్తున్న కేంద్రం... ఆ చట్టాల్లో సవరణలు చేసేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేస్తోంది. సవరణలు చేయాలంటే పార్లమెంటు సమావేశాలు తప్పనిసరి అయిన నేపథ్యంలో, దీనిపై కేంద్రం యోచిస్తోంది. రైతులతో ఈ నెల 9న మరోసారి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే పార్లమెంటు సమావేశాలపై తుది నిర్ణయం ఉండనుంది.


More Telugu News