భారత్‌లో వినియోగానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్‌గా ఫైజర్!

  • బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదముద్ర 
  • బహ్రెయిన్ కూడా ఆమోదం
  • దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని వినతి
  • వ్యాక్సిన్‌ దిగుమతి, పంపిణీలకు అనుమతించాలి
అమెరికా సంస్థ ఫైజర్‌, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అనంతరం ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి బహ్రెయిన్ కూడా ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగం కింద ఆ దేశాలు ఆమోదం తెలిపాయి.

ఈ వ్యాక్సిన్‌ సురక్షితమని బ్రిటన్‌ సంస్థ ‘మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ’ ఇటీవలే తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా ఆ రెండు దేశాల మార్గంలోనే నడుస్తోంది. దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఫైజర్, భారత ఔషధ నియంత్రణ జనరల్‌ (డీసీజీఐ)ని కోరింది.

భారత్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్‌ ఇదే. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించడం, పంపిణీలకు అనుమతించాలని కోరింది. అలాగే, భారత ప్రజలపై క్లినికల్‌ పరీక్షల నిర్వహణ ఆవశ్యకతను ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేలా కేవలం ప్రభుత్వంతో మాత్రమే ఒప్పందాలు ఉంటాయని ఫైజర్‌ తెలిపింది. భారత్‌కు అవసరమైన డోసులను వీలైనంత త్వరగా అందించేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని వాడుకుంటామని చెప్పింది.


More Telugu News