కొవాగ్జిన్ టీకా వేయించుకున్న హర్యానా మంత్రికి కరోనా సోకడంపై భారత్ బయోటెక్ వివరణ

  • మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్
  • కొవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సిన్ అని స్పష్టీకరణ
  • మంత్రి ఒక డోసు మాత్రమే తీసుకుని ఉంటారని వ్యాఖ్యలు
కొవాగ్జిన్ పేరిట దేశీయంగా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ హర్యానా మంత్రి అనిల్ విజ్ కు వైరస్ సోకడంపై స్పందించింది. అనిల్ విజ్ ఇటీవలే కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా వైరస్ బారినపడడంపై భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది.

కొవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సిన్ అని, 28 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు డోసులు వేయించుకోవాల్సి ఉంటుందని, అప్పుడే వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని వివరించింది. రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తర్వాతే వ్యాక్సిన్ పనితీరును నిర్ణయించగలమని స్పష్టం చేసింది. మంత్రికి ఒక డోసు మాత్రమే ఇచ్చి ఉంటారని, వైరస్ సోకడంపై ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని భారత్ బయోటెక్ వివరించింది.

కాగా, ప్రస్తుతం భారత్ బయోటెక్ దేశంలో మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ దశలో క్లినికల్ ట్రయల్స్ రెండు రకాలుగా ఉంటాయి. 50 శాతం మంది వలంటీర్లకు అసలైన వ్యాక్సిన్ ఇస్తారు, మరో 50 శాతం మందికి వ్యాక్సిన్ ఏమాత్రం లేని ప్లాసిబో ద్రావణాన్ని మాత్రమే ఇస్తారు. అయితే, వలంటీర్లలో ఎవరికి అసలైన వ్యాక్సిన్ ఇచ్చారో, ఎవరికి నకిలీ వ్యాక్సిన్ (ప్లాసిబో) ఇచ్చారో వారికి చెప్పరు. ఎవరికి వారు వ్యాక్సిన్ తీసుకున్నామన్న మానసిక సంతృప్తితో వుంటారు. ఆ తర్వాత దుష్ప్రభావాలను, పనితీరును అంచనా వేస్తారు. ప్లాసిబో తీసుకున్న వారిలో మానసికంగా ఏదైనా ప్రభావం చూపించిందా? అన్నది పరిశీలిస్తారు. మంత్రి అనిల్ విజ్ కు ప్లాసిబో ఇచ్చి ఉంటారని భారత్ బయోటెక్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.


More Telugu News