గ్రేటర్ లో టీఆర్ఎస్ కు 35.81 శాతం, బీజేపీకి 35.56 శాతం ఓట్లు... 0.25 శాతం తేడాతో రెండో స్థానానికి పరిమితమైన కమలనాథులు!

  • ఇరు పార్టీల మధ్యా ఓట్ల తేడా పావు శాతమే
  • 8,456 ఓట్ల తేడాతో రెండో స్థానానికి బీజేపీ
  • స్వల్పంగా ఓట్లను పెంచుకున్న ఎంఐఎం
గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అతిపెద్ద పార్టీగా నిలిచి 55 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, ఓట్ల శాతం పరంగా చూస్తే కనుక, బీజేపీ అతిదగ్గరలోనే ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 12,04,167 ఓట్లు రాగా, బీజేపీకి 11,95,711 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే, మొత్తం పోలైన ఓట్లలో 35.81 శాతం టీఆర్ఎస్ కు రాగా, 35.56 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే, రెండు పార్టీల మధ్యా ఉన్న ఓట్ల తేడా శాతం కేవలం 0.25 మాత్రమే.

ఈ పావు శాతం ఓట్ల తేడాతోనే... అంటే కేవలం 8,456 ఓట్లు తగ్గిన కారణంగానే కమలనాధులు 48 సీట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక ఇదే సమయంలో ఎంఐఎంకు 18.76 శాతం ఓట్లతో మొత్తం 6,30,866 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 6.67 శాతం ఓట్లతో 2,24,528 ఓట్లు వచ్చాయి. ఇక పోటీ చేసిన అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయిన టీడీపీకి 1.66 శాతం ఓట్లు మాత్రమే... అంటే 55,662 ఓట్లు మాత్రమే వచ్చాయి.

కాగా, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 43.85 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు దాదాపు 8 శాతం ఓట్లు తగ్గాయి. 2016లో వచ్చిన ఓట్లతో పోలిస్తే, టీఆర్ఎస్ కు ఇప్పుడు 2,64,451 ఓట్లు తగ్గాయి. ఇదే సమయంలో 2016లో 10.34 శాతం ఓట్లను సాధించిన బీజేపీ ఇప్పుడు మరో 25 శాతం మేరకు ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. పాతబస్తీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎం ఓట్ల శాతం స్వల్పంగా పెరిగింది. అప్పట్లో 15.85 శాతం ఓట్లను సాధించిన ఎంఐఎం ఓట్ల శాతం ఇప్పుడు 18.76 శాతానికి పెరిగింది.


More Telugu News