నాడు రాజారెడ్డి చేసిందే నేడు ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు: జగన్ పై చంద్రబాబు ఫైర్

  • అధికారుల మెడపై కత్తిపెట్టి బెదిరిస్తున్నారన్న చంద్రబాబు
  • టీడీపీని దెబ్బతీసేందుకు నీచానికి దిగుతున్నారని వ్యాఖ్యలు
  • ప్రశ్నిస్తే ఆయనను డ్రామానాయుడు అంటారా? అంటూ మండిపాటు 
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికార వైసీపీపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీని దెబ్బతీసేందుకు అధికారుల మెడపై కత్తిపెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, ఇది నీచం కాదా? అని ప్రశ్నించారు. మీపై మాకేం కోపంలేదు... టీడీపీని దెబ్బతీయడానికే అంటూ అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

"అప్పుడు రాజారెడ్డి ఉండేవాడు. ఇక్కడున్న వాళ్లకు ఆయన తెలుసో లేదో కానీ, అతనేం చేసేవాడంటే... ఎక్కడికక్కడ మనుషులను పంపించి మామిడి తోటలు, చీనీ తోటలను నరికించేసేవాడు. అవతలి వ్యక్తి ఆర్థికంగా ఇక కోలుకోకూడదు అనేది అతని ఉద్దేశం. ఇప్పుడదే చేస్తున్నాడు ఈ ఉన్మాది కూడా. మొత్తం ఆస్తులు లాగేసుకుంటున్నాడు. కృష్ణపట్నం, మచిలీపట్నం సంగతి ఏమైంది? గెలాక్సీ గ్రానైట్, కాకినాడ పోర్టు ఏమయ్యాయి? ఇలాంటివే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తుంటే చాలా దుర్మార్గం అనిపిస్తుంది.

పన్నులు బాగా పెంచేసి ప్రజలను బాగా బాధించి ఆ డబ్బులు వసూలు చేయాలన్నది వారి ఆలోచన. కొంతమందికి ఓ 20, 30 శాతం ఇచ్చినట్టు నటన చేసి దాన్ని తమ సాక్షి పేపర్లో ఫుల్ పేజీలో ప్రకటనలు వేసుకుంటారు. ఎవడబ్బ సొమ్ము ఇది? హెరిటేజ్ మాత్రం దెబ్బతినాలి, నీ సిమెంట్ కంపెనీలకు మాత్రం ధరలు పెంచుకోవచ్చు. నీ పత్రికలో ఫుల్లు అడ్వర్టయిజ్ మెంట్లు. ఎవడైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే వాడిని మాత్రం ఫినిష్ చేసేయాలి... నువ్వు మాత్రం మొత్తం దోచేసుకోవాలి. ఇసుక, మైనింగ్, భూములు, మద్యం ప్రతిదీ కుంభకోణమే. ప్రతిదానికీ పన్నులు వేస్తున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు.

అంతేగాకుండా సీఎం జగన్ అసెంబ్లీలో పెన్షన్ పై రోజుకో మాట మాట్లాడుతున్నాడని అన్నారు. సీఎం ప్రతి రోజు పొంతనలేని గణాంకాలు చెబుతున్నారని ఆరోపించారు. ఓ సీఎం అంత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడడం తానెప్పుడూ చూడలేదని అన్నారు. బజార్లో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. రామానాయుడు ప్రశ్నిస్తే ఆయనను డ్రామానాయుడు అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News