మేం ఆశించిన ఫలితం రాలేదు... అలాగని నిరాశ చెందడం లేదు: కేటీఆర్

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్
  • మరో 25 డివిజన్లు వస్తాయని భావించామన్న కేటీఆర్
  • చాలాచోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని వివరణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 56 డివిజన్లు మాత్రమే దక్కడం పట్ల మంత్రి కేటీఆర్ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది అంకంలో ఉండగా, ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటికే టీఆర్ఎస్ స్థానాలపై స్పష్టత వచ్చింది. 55 డివిజన్లలో నెగ్గి ఒక చోట ఆధిక్యంలో నిలిచింది.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని అన్నారు. మరో 25 డివిజన్ల వరకు దక్కుతాయని భావించినా ఫలితాలు మరోలా వచ్చాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు తక్కవ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని తెలిపారు. ఓ 12 సీట్లలో కేవలం 100, 200 ఓట్ల తేడాతో ఓటమిపాలైనట్టు తెలిసిందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పారు.

ఇందులో నిరాశ పడాల్సిందేమీ లేదని అన్నారు. పార్టీ పరంగా సమీక్ష నిర్వహించుకుని, ఫలితాలపై విశ్లేషించుకుని ముందుకు పోతామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తమకు ఓటేసి అతిపెద్ద పార్టీగా నిలిపిన ప్రతి సోదరుడు, సోదరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు.


More Telugu News