పేర్ని నానిపై దాడి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు.. కొల్లు రవీంద్రపై చర్యలు సరికాదు: చంద్రబాబు

  • తప్పుడు కేసులు పెట్టి కొల్లు రవీంద్రపై కక్ష సాధింపు 
  • పేర్ని నానిపై భవన నిర్మాణ కార్మికుడు నాగేశ్వరరావు దాడి
  • టీడీపీ నేతలే చేయించారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం
  • కొల్లు రవీంద్రను ఇరికించే ప్రయత్నమన్న చంద్రబాబు 
మచిలీపట్నంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించి కలకలం రేపిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసు స్టేషన్‌కు తరలించి, ప్రశ్నించేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. తమకు సంబంధం లేని విషయంలో ప్రశ్నించడానికి పోలీసులు తమ ఇంటికి వచ్చారంటూ కొల్లు రవీంద్ర మండిపడుతున్నారు.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ కేసును వైసీపీ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని, తప్పుడు కేసులు పెట్టి కొల్లు రవీంద్రపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ తీరుపై ఆవేదనతోనే పేర్ని నానిపై భవన నిర్మాణ కార్మికుడు నాగేశ్వరరావు దాడి చేశాడని, అయినప్పటికీ ఈ ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండించిందని అన్నారు.

ఈ దాడిని టీడీపీ నేతలే చేయించారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసులో కొల్లు రవీంద్రను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా టీడీపీ నాయకులకే ముడిపెడతారా? అని ప్రశ్నించారు. గతంలోనూ కుటుంబ కలహాలతో జరిగిన హత్యలో కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు.


More Telugu News