వెల్లడైన ఆర్బీఐ పరపతి నిర్ణయాలు... మారని వడ్డీ రేట్లు!

  • ఇంకా మెరుగుపడని జీడీపీ 
  • రెపో, రివర్స్ రెపో రేట్లు యథాతథం
  • ఆర్థిక వృద్ధి బలోపేతంపైనే దృష్టి
  • వెల్లడించిన ఆర్బీఐ చైర్మన్ శక్తికాంత దాస్
స్థూల జాతీయోత్పత్తి ఇంకా అనుకూలంగా లేకపోవడం, టోకు, చిల్లర ధరల సూచికల ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉండటంతో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ ఈ ఉదయం ప్రకటించింది. పరపతి సమీక్ష నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన ఆర్బీఐ చైర్మన్ శక్తికాంత దాస్, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడంపై దృష్టిని సారించామని అన్నారు.

రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా, బ్యాంక్ రేటు 4.25 శాతంగా కొనసాగుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పుడు అమలు చేస్తున్న అకామడేటివ్ పరపతి విధానాన్ని సమీప భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొంటూ, 2020-21 ఆర్థిక సంవత్సరం జీడీపీ గ్రోత్ అంచనాలను సవరిస్తున్నామని వెల్లడించింది. ఈ సంవత్సరం జీడీపీ మైనస్ 7.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసిన శక్తికాంత దాస్, గతంలో వేసిన అంచనాల కన్నా వ్యతిరేక వృద్ధి తగ్గిందని తెలిపారు.

కాగా, అక్టోబర్ లో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమీక్షలో జీడీపీ వృద్ధి మైసన్ 9.5 శాతం వరకూ ఉండవచ్చని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలోనే వృద్ధి రేటు పాజిటివ్ లోకి వస్తుందని, నాలుగో త్రైమాసికంలో... అంటే 2021 జనవరి - మార్చి మధ్య కాలంలో 0.7 శాతం వరకూ ఉంటుందని పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్నాయని, వ్యవస్థలో ద్రవ్య లభ్యత, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ తరఫున అన్ని చర్యలూ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన పలు రంగాలు ప్రస్తుతం కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే వేగం కూడా పెరిగిందని అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, మే 22న జరిగిన పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్, ఆపై మూడు సార్లు సమీక్షించినా, వడ్డీ రేట్లను మార్చక పోవడం గమనార్హం.


More Telugu News