ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో 25 ఏళ్ల నల్గొండ యువకుడు!

  • ‘30 అండర్ 30’ జాబితాలో కోణం సందీప్ పేరు
  • ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్ రూపకల్పన
  • అభినందించిన మంత్రి కేటీఆర్
ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ యువకుడు కోణం సందీప్ (25)కు స్థానం దక్కింది. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేషంగా కృషి చేసినందుకు గాను అతడికీ గుర్తింపు లభించింది. ఈ విభాగంలో ఫోర్బ్స్ రూపొందించిన ‘30 అండర్ 30’ జాబితాలో సందీప్‌ పేరును చేర్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్‌ను రూపొందించినందుకు గాను సందీప్‌కు ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఇతర దేశాల్లోని వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను ఈ యాప్ రోగుల మాతృభాషలోకి అనువదిస్తుంది.

డాక్టర్ శివరావ్‌తో కలిసి 2018లో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ‘అబ్రిడ్జ్ పేరుతో హెల్త్ కేర్ గ్రూప్ సంస్థను సందీప్ ప్రారంభించాడు. వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై ఇది పరిశోధనలు చేస్తోంది. ఇడుపులపాయ ఆర్‌జీయూకేటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన సందీప్.. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో రోబోటిక్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశాడు. హెల్త్‌కేర్ టెక్నాలజీకి చెందిన పలు యాప్‌లు రూపొందించాడు.

సందీప్ కోణం పేరుతో ఓ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. సందీప్ తండ్రి శ్రీనివాస్ కనగల్ మండలంలోని కురంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా, ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న సందీప్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.


More Telugu News