వ్యాక్సిన్ పై బ్రిటన్ కు అంత తొందరెందుకు?: ఆంటోనీ ఫౌసీ

  • బ్రిటన్ తొందరపడిందన్న ఫౌసీ
  • రెండు రోజుల క్రితం వ్యాక్సిన్ కు అనుమతిచ్చిన అధికారులు
  • వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవచ్చు
కరోనా వ్యాక్సిన్ ను ప్రజలు వాడేందుకు అనుమతి ఇచ్చే విషయంలో బ్రిటన్ తొందరపడిందని అమెరికాలో ప్రముఖ అంటురోగాల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ అభిప్రాయపడ్డారు. బ్రిటన్ వైద్యాధికారులు అతి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ అనుమతి ప్రక్రియను ప్రారంభించి, పూర్తి చేశారని, అంత తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, యూకే ఈ నెల 2న వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఫైజర్ - బయో ఎన్ టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచంలో తొలిసారిగా అనుమతించిన దేశంగా యూకే నిలిచింది. తాజాగా 'ఫాక్స్ న్యూస్'తో మాట్లాడిన ఫౌసీ, ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పనిని, చాలా తొందరగా బ్రిన్ పూర్తి చేసేసిందని, ఈ వ్యాక్సిన్ ను తీసుకునేందుకు బ్రిటన్ ప్రజలు ఆసక్తి చూపుతారని భావించడం లేదని అన్నారు.

"తాము ప్రస్తుతం అన్ని వ్యాక్సిన్ల డేటాను కూలంకుషంగా పరిశీలిస్తున్నామని, అమెరికన్లకు అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్ ను అందించే లక్ష్యంతోనే ఉన్నాము" అని ఫౌసీ వ్యాఖ్యానించారు. నియంత్రణా సంస్థలకు అనుమతులు ఇచ్చే విషయంలో తాము అత్యున్నత ప్రమాణాలను అమలు చేస్తున్నామని, ఈ విషయంలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నో నిబంధనలను పాటిస్తోందని తెలిపారు.

కాగా, ఓ వ్యాక్సిన్ తయారీకి సాధారణంగా దశాబ్దపు కాలం పడుతుందని అంటారు. అదే డెవలప్ మెంట్ ను ఫైజర్ - బయో ఎన్ టెక్ కంపెనీలు కేవలం 10 నెలల వ్యవధిలోనే పూర్తి చేయడం గమనార్హం. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని, ప్రభావవంతమైనదని సర్టిఫికెట్ ఇచ్చిన బ్రిటన్ వాడకానికి అనుమతులు ఇవ్వగానే, మిగతా దేశాలు కూడా అదే ఆలోచనలో పడటంతో ఫైజర్ వ్యాక్సిన్ కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.


More Telugu News